: జమ్మూ కాశ్మీర్ రంజీ జట్టును అభినందించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర క్రికెట్ జట్టును అభినందించారు. కొన్నిరోజుల క్రితం కాశ్మీర్ జట్టు 40 సార్లు రంజీట్రోఫీ విజేత ముంబయిపై ఘనవిజయం సాధించింది. ప్రధాని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడుతూ, "జమ్మూ కాశ్మీర్ జట్టు ముంబయిని ఓడించింది. అయితే, దీన్ని గెలుపోటముల కోణంలో చూడడంలేదు. మరోలా చూస్తున్నాను. ఇటీవల వరదల కారణంగా కాశ్మీర్లోని అన్ని మైదానాల్లో నీరు చేరింది. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, వాటన్నింటినీ పక్కన పెడుతూ, ఉన్నతస్థాయికి ఎదిగేందుకు జమ్మూ కాశ్మీర్ జట్టు కనబరిచిన తపన, స్ఫూర్తి అద్భుతం" అని పేర్కొన్నారు. ముంబయిపై వారు గెలిచిన వార్త వినగానే ఎంతో సంతోషించానని మోదీ తెలిపారు. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో జమ్మూకాశ్మీర్ జట్టు 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అపురూపమైన విజయాన్నందుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించిన శుభమ్ ఖజూరియా రెండో ఇన్నింగ్స్ లో 78 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివర్లో పర్వేజ్ రసూల్ (32), హర్ దీప్ సింగ్ (41*) విలువైన పరుగులు చేసి జమ్మూ కాశ్మీర్ జట్టును విజయపథంలో నడిపారు.