: బిల్డర్ మోసం చేశాడని నటుడు జగపతిబాబు ఫిర్యాదు... చేతులెత్తేసిన బల్దియా!
సామాన్యులతో పాటు సెలబ్రిటీలకూ రియల్ ఎస్టేట్ బిల్డర్ల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. బిల్డర్ల మాయమాటలతో తను మోసపోయానంటూ నటుడు జగపతిబాబు బల్దియాకు ఫిర్యాదు చేయగా, తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేయడం గమనార్హం. కూకట్పల్లిలో లోధా బిల్డర్స్ సుమారు 32 అంతస్తులతో ఐదు బ్లాకుల్లో లగ్జరీ అపార్ట్ మెంట్ల నిర్మాణానికి అనుమతులు పొందారు. మూడు బ్లాకులలో లగ్జరీ ఫ్లాట్లు నిర్మించిన బిల్డర్ మిగిలిన రెండు బ్లాకుల్లో సాధారణ అపార్ట్ మెంట్లను నిర్మించాడు. దీని కోసం రివైజ్డ్ ప్లాన్ సమర్పించి బల్దియా నుంచి అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. అయితే, లగ్జరీ అపార్ట్మెంట్లకూ మిగిలిన వాటికీ ధరలో ఎంతో తేడా ఉండటంతో, లగ్జరీ అపార్ట్ మెంట్ల విలువ పడిపోయింది. నిబంధనల ప్రకారమే లోధా బిల్డర్స్ అనుమతులు పొందినందున తాము చేసేదేమీ లేదని, అది బిల్డర్కూ, కొనుగోలుదార్లకు మధ్య వివాదమని ఓ అధికారి తెలిపారు.