: క్రిస్మస్ నుంచి ఆన్ లైన్ లో తాజ్ మహల్ ఎంట్రీ టికెట్
తాజ్ మహల్ సందర్శించే వారు ఇకనుంచి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నెలలో క్రిస్మస్ పండుగ నుంచి ఆన్ లైన్ బుకింగ్ ను ప్రారంభిస్తున్నట్టు దేశ పురావస్తు సర్వే వారు తెలిపారు. మహల్ లోపలికి అనధికారికంగా, నకిలీ టికెట్లతో వస్తున్న వారిని అరికట్టేందుకు తీసుకురాబోతున్న ఈ ఆన్ లైన్ బుకింగ్ ను ఆగ్రా పర్యాటక అధికారులు స్వాగతించారు. ముందుగానే ఆన్ లైన్ లో ఈ-టికెట్ బుకింగ్ వల్ల ఇకనుంచి టికెట్ల కోసం బారులుతీరే వారి సంఖ్య తగ్గుతుందని టూరిస్ట్ గైడ్ వేద్ అంటున్నాడు. దాంతో, పర్యాటకులు ప్రింట్ అవుట్ తీసిన టికెట్లతో, ఐడెంటిటీ ప్రూఫ్ తో వస్తారని అన్నాడు. టిక్కెట్లను పునఃవిక్రయం చేయడం అనేక సంవత్సరాలుగా ఇక్కడ సమస్యగా మారింది. కానీ ఈ-టికెట్ సౌలభ్యంతో బ్లాక్ లో టికెట్లను అమ్మే విధానాన్ని తగ్గించవచ్చు. ఈ నేపథ్యంలో ఐఆర్ సీటీసీ, టూరిజం కార్పొరేషన్ సంయుక్తంగా స్మార్ట్ గవర్నెన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో చేపడుతున్న ఈ విధానానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నెల 25న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఆన్ లైన్ బుకింగ్ ను ప్రారంభిస్తున్నారు.