: సీసీ పుటేజ్ తీయండి... వాస్తవాలు తెలుస్తాయి: వంశీచంద్ రెడ్డి
సీసీ పుటేజ్ తీస్తే వాస్తవాలు తెలుస్తాయని వంశీచంద్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తాను విజయం సాధించానని ఆయన అన్నారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న పెళ్లికి అమ్మాయి తరపు వారు తనను ఆహ్వానించారని ఆయన చెప్పారు. తనను ఆహ్వానించిన వ్యక్తి పదే పదే ఫోన్ చేసి పిలవడంతో తాను ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లికి వెళ్లానని ఆయన వివరించారు. ఆ పెళ్లిలో మాజీ ఎమ్మెల్యే విష్ణు ఉన్నారని, ఆయన పలకరించారని ఆయన తెలిపారు. నా తల్లిదండ్రులు, గురువులు నేర్పిన సంస్కారంతో అతనికి నా చేయి ఇచ్చి విష్ చేశానని ఆయన వెల్లడించారు. వెంటనే ఆయన తన చేతి వేళ్లను విరగ్గొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. దాంతో తన చేతిని అతని చేతిలోంచి లాక్కునే ప్రయత్నం చేశానని ఆయన చెప్పారు. వెంటనే ఆయన దాడి చేయడం జరిగిందని, అప్పుడు తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని ఆయన వివరించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు దాడి చేస్తుంటే, అక్కడే ఉన్న గన్ మెన్ తన బాధ్యత నిర్వర్తించాడని ఆయన చెప్పారు. అతనిని పట్టుకుని విష్ణుకు చెందిన 30 మంది అనుచరులు దాడి చేయడం జరిగిందని ఆయన అన్నారు. 5 నుంచి 10 నిమిషాలు అంతా షాక్ కు గురయ్యారని అన్నారు. అంతా చేసిన ఆయనే తనపై కేసు పెట్టడం జరిగిందని, తాను జరిగినది మాత్రమే పోలీస్ స్టేషన్ లో చెప్పానని ఆయన వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణు వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి, ఆయన మాటతీరు అందరికీ తెలిసిందేనని చెప్పిన ఆయన, దాడి కూడా ఎవరు చేసి ఉంటారో ఊహించవచ్చని తెలిపారు. గతంలో విష్ణు స్వయానా మాజీ సీఎం వైయస్ తమ్ముడిపై దాడి చేశారని గుర్తు చేశారు. అంతెందుకు మీడియా సాక్షిగా సీసీ కెమెరా పుటేజ్ ను చూద్దాం, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో తెలిసిపోతుందని ఆయన సవాలు విసిరారు. తాను సంస్కారవంతుడ్నని, ఎవరిపైనా విమర్శలు చేయనని ఆయన స్పష్టం చేశారు. తనెవరి మోచేతి నీళ్లు తాగి ఎమ్మెల్యే కాలేదని, తాను ఎవరి వెనుక లేనని ఆయన స్పష్టం చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒక్కటేనని, అంతా సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని ఆయన సూచించారు. ఈ విషయంలో తప్పెవరిదో వారు శిక్షించబడాలని ఆయన కోరారు. కచ్చితంగా న్యాయం గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా తమ ఇద్దరి మధ్య విభేదాలు లేవని ఆయన కోరారు.