: భారత్ ను ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తాం: వార్నర్
పిచ్ మరీ నాసిరకంగా ఏమీలేదని, భారత్ ను రేపటి ఆటలో ఆలౌట్ చేస్తామని ధీమాగా చెబుతున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. అడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు నమోదు చేసిన వార్నర్ నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చివరి రోజు ఆటలో 10 వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. పిచ్ కాస్త రఫ్ గా తయారైన నేపథ్యంలో, ఆఫ్ స్పిన్నర్ లియాన్ ది కీలక పాత్ర కానుందని ఈ లెఫ్ట్ హ్యాండర్ పేర్కొన్నాడు. గడచిన రెండేళ్లలో లియాన్ ఎంతో పరిణతి చెందాడని, తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినట్టుగానే, రెండో ఇన్నింగ్స్ లోనూ రాణిస్తాడని, అందులో సందేహం లేదని చెప్పాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని, బంతి నలిగిన తర్వాత రివర్స్ స్వింగ్ రాబడతామని తెలిపాడు.