: యూపీ గవర్నర్ 'రామమందిరం' వ్యాఖ్యలపై విపక్షాల మండిపాటు... కాషాయదళం మద్దతు


బాబ్రీ మసీదు ప్రాంతంలో రామమందిరం కట్టాలంటూ ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది. మసీదును కూల్చివేసిన ప్రాంతంలో మందిరం కట్టాలన్నది దేశ ప్రజల ఆకాంక్ష అని నాయక్ పేర్కొన్నారు. ఫైజాబాద్ లోని అవధ్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ, జేడీయూ మండిపడ్డాయి. గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి రామ మందిరం నిర్మించాలనడం అభ్యంతరకరం అని ఎన్సీపీ నేత తారిఖ్ అజీత్ అన్నారు. గవర్నర్ పదవికి నాయక్ రాజీనామా చేయాలంటూ జేడీయూ డిమాండ్ చేసింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, అందుకే ఆయనను ఉత్తరప్రదేశ్ గవర్నర్ పదవి నుంచి తక్షణం తొలగించాలని రాష్ట్రపతిని కోరతామని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. ఆయన కనీసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యుడు కారని, ఒకవేళ, అది అతని వ్యక్తిగత అభిప్రాయం అయ్యుంటే, వ్యాఖ్యానించకుండా ఉండాల్సిందని సమాజ్ వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ అన్నారు. కాగా, రామ్ నాయక్ వ్యాఖ్యలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన మద్దతు పలికాయి. ఆయన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నాయి. "రాముని జన్మస్థలంలో మందిరం కట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలా కోరుకోవడం తప్పు కాదు" అని బీజేపీ నేత విజయ్ బహదూర్ తెలిపారు. ఇక, శివసేన కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. నాయక్ రామమందిరం ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు మందిరం నిర్మాణానికి అవకాశం వచ్చిందని, అది జాతీయ దేవాలయం అని ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ రౌత్ అన్నారు.

  • Loading...

More Telugu News