: నిర్భీక్... మహిళలకు నమ్మకమైన నేస్తం!


ఢిల్లీలో 'నిర్భయ' ఉదంతం తర్వాత భారత్ లో స్త్రీల భద్రత ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైంది. ఆ తర్వాత జరిగిన అనేక అత్యాచారాలు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాయి. తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనల పిమ్మట సర్కారు 'నిర్భయ' పేరిట చట్టం రూపొందించి, అంతటితో సరిపెట్టుకుంది. అత్యాచార పర్వం మాత్రం ఆగలేదు. కానీ, నిర్భయ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా విద్యావంతులైన మహిళల దృక్పథంలో క్రమంగా మార్పు వస్తోంది. ఈ క్రమంలో వెంట ఆయుధాలు ఉంచుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి వారి కోసం 'నిర్భయ' స్ఫూర్తిగా ఓ రివాల్వర్ రూపొందించారు. దాని పేరు 'నిర్భీక్'. ఇది పాయింట్ 32 రివాల్వర్. టైటానియంతో తయారుచేశారు. 6 బుల్లెట్ల సామర్థ్యం కలది. తేలిగ్గా ఉండడంతో మహిళలు హ్యాండ్ బ్యాగుల్లో వెంట తీసుకెళ్లే వీలుంది. కాన్పూర్ లోని భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ రివాల్వర్లను తయారుచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో 'నిర్భీక్' రివాల్వర్ల విక్రయాలు ఆరంభించారు. దీనిని కొనుగోలు చేసిన సీమా ఖర్భందా అనే మహిళ మాట్లాడుతూ, "ఈ రివాల్వర్ నా వెంట ఉంచుకోవడంతో సురక్షితమన్న భావన కలుగుతోంది. ఇది నాకో ఆభరణం వంటిది. ఏవైనా నగలు వెంట తీసుకెళుతున్నప్పుడు భయంవేస్తుంది... ఎక్కడ దోచుకుంటారోనని. అదే, ఈ రివాల్వర్ వెంట ఉంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. స్త్రీలు నగల విషయంలో ఎంతో ఖర్చు చేస్తారు. వారు దీన్ని కూడా ముఖ్యమైనదేనని భావించి కొనుగోలు చేయాలి" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News