: భారత్, రష్యా బంధం కాలపరీక్షను తట్టుకుంది: మోదీ
భారత్, రష్యా బంధం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కీలక ఒప్పందాలపై భారత్, రష్యాలు సంతకాలు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రక్షణ రంగానికి రష్యా సాయం మరువలేనిదని అన్నారు. భారత్, రష్యాలు ప్రతి ఏటా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించాలన్నది మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో తీసుకున్న నిర్ణయమని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో భారత్ కు అత్యంత ప్రధాన భాగస్వామి రష్యా అని మోదీ స్పష్టం చేశారు. భారత్ లో రక్షణ పరికరాల తయారీకి రష్యా పూర్తి సహకారం అందిస్తోందని ఆయన వెల్లడించారు. అత్యంత ఆధునిక హెలికాప్టర్లను భారత్ లోనే తయారు చేసేందుకు రష్యా ముందుకొచ్చిందని ఆయన చెప్పారు. భారత్, రష్యా మైత్రికి కూడంకళం అణువిద్యుత్ కేంద్రమే ప్రతీక అని ఆయన అన్నారు. కూడంకళంలో మరో మూడు యూనిట్లు తయారు చేయాల్సి ఉందని, వాటి నిర్మాణం కూడా సజావుగా సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చమురు, సహజవాయు రంగాల్లో ఈ రోజు జరిగిన ఒప్పందాలు భవిష్యత్ స్నేహానికి ప్రతీకలని ఆయన తెలిపారు. భారత్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నందుకు పుతిన్ కు ధన్యవాదాలని మోదీ చెప్పారు.