: బ్రూస్ లీ మళ్లీ పుట్టాడు!
సాధారణంగా మన కుటుంబంలో పెద్దలు ఎవరైనా మరణిస్తే తరువాత పుట్టిన పిల్లల్లో వారి పోలికలు చూసుకుంటాం. పోలికలు కనిపిస్తే వారు మళ్లీ పుట్టారని సంబరపడిపోతాం. బయటి వారిలో ఆ పోలికలు కనిపిస్తే అచ్చం అలానే ఉన్నారని ఆసక్తిగా చూస్తాం. అలాంటి సంఘటనే సామాజిక మాధ్యమాల్లో చోటు చేసుకుంది. బ్రూస్లీలా ఉన్న ఓ వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ పురాతన కట్టడం ఎదురుగా ఫ్లయింగ్ కిక్ ఇస్తున్నట్టుగా ఉన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్బాస్ అలీ జాదా అనే యువకుడు అచ్చం బ్రూస్లీలా ఉంటాడు. బ్రూస్లీ ఫోటో పక్కనే నిలబడి అబ్బాస్ ఓ ఫోటో తీయించుకున్నాడు. దానికి ఓల్డ్ డ్రాగన్-న్యూ డ్రాగన్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఆ ఫోటోకి మంచి ఆదరణ లభించింది. అతనిపై బీబీసీ న్యూస్ ఓ కథనాన్ని కూడా ప్రసారం చేసింది. తనకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టమని, ఆయన స్పూర్తితో 14వ ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని ఈ నయా బ్రూస్లీ చెప్పాడు. బ్రూస్లీ పోలికల కారణంగా తనకు ఎవరైనా అవకాశం కల్పిస్తే మూడుపూటలా కుటుంబాన్ని పోషించుకుంటానని ఆర్థిక స్తోమత అంతంతగా ఉండే ఈ ఆఫ్ఘన్ బ్రూస్లీ కోరుతున్నాడు.