: బంగారానికి పెళ్లి కళ... వారం వ్యవధిలో రూ.2 వేలకు పైగా పెరిగిన ధర
ఈ నెలారంభంలో రూ.25,350 వద్ద ఉన్న పది గ్రాముల బంగారం ధర నేడు రూ.27,500 కు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో, కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయని, అందువల్లే ఇన్వెస్టర్ ల సెంటిమెంట్ పెరిగి ఆ ప్రభావం బంగారం ధరలపై పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. నిన్నటి సెషన్ లో బంగారం ధర ఏకంగా రూ. 650 పెరిగిన సంగతి తెలిసిందే. మొత్తం మీద గడచిన పది రోజుల్లో బంగారం ధర దాదాపు రూ.2 వేలకు పైగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ లో ప్రజలతో పాటు ఆభరణాల వ్యాపారులు, ట్రేడర్లు భారీ స్థాయిలో కొనుగోళ్లకు దిగుతున్నారని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు డాలర్ మారకంతో రూపాయి విలువ మరింత క్షీణించడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా పెరగవచ్చని, జనవరి మూడవ వారం నుంచి ధరలు తగ్గే అవకాశాలున్నాయని సమాచారం.