: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో డిజిటల్ క్లాస్ రూంలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఓ జాతీయ వార్తా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తరగతి గదుల డిజిటలీకరణపై టాటా సంస్థకు చెందిన 'క్లాస్ఎడ్జ్' అధికారులు చంద్రబాబుతో సచివాలయంలో సమావేశమయ్యారు. క్లాస్ఎడ్జ్ సీఈవో నీరవ్ ఖంబాటి, ఇతర అధికారులు బాబుకు ఈ కాన్సెప్ట్ ను వివరించారు. ఈ సందర్భంగా బాబు సిస్కో సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాలని టాటా గ్రూప్ కు సూచించారు. ఈ ఆధునిక విధానంతో విద్యార్థులు పాఠాలను తెరపై వీక్షించడం ద్వారా సరికొత్త పంథాలో నేర్చుకుంటారని క్లాస్ఎడ్జ్ ప్రతినిధులు తెలిపారు. మహారాష్ట్రలోని 350 పాఠశాలల్లో ఈ డిజిటల్ విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ ఒక్కో తరగతి గది డిజిటలీకరణకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని వారు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ డిజిటల్ క్లాస్ రూం విధానంతో ఏపీలో విద్యా వ్యవస్థ కొత్తరూపు సంతరించుకుంటుందని బాబు అభిప్రాయపడ్డారు.