: చావుకు భయపడలేదంటున్న సాకర్ లెజెండ్
బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే (74) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర కిడ్నీ సమస్యతో ఆయన సావోపౌలో లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత కొన్నివారాలుగా ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా, పీలే ఆరోగ్యం మెరుగుపడిందని, కోలుకున్నట్టేనని వైద్యులు తెలిపారు. పక్షం రోజుల క్రితం పీలే ఆసుపత్రి పాలవడంతో సాకర్ అంటే పడిచచ్చే బ్రెజిలియన్లలో ఆందోళన నెలకొంది. ఆయన కోలుకోవాలని అభిమానులు దేశవ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించారు. కాగా, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పీలే మీడియాతో మాట్లాడారు. తీవ్ర అనారోగ్యం పాలైనా, తాను చావుకు భయపడలేదని అన్నారు. తనకు మూడు గుండెలున్నాయంటూ తన జన్మస్థలం ట్రెస్ కారకోస్ ను ఉదహరించారు. పోర్చుగీస్ భాషలో ట్రెస్ కారకోస్ అంటే 'మూడు హృదయాలు' అని వివరించాడు. అంతేగాదు, ఓ జోక్ కూడా పేల్చాడీ సూపర్ ఫార్వర్డ్. 2016లో రియో డి జనీరో ఒలింపిక్స్ లో ఆడేందుకు ప్లాన్ చేస్తున్నానని చమత్కరించాడు. దీంతో, అక్కడ నవ్వులు విరబూశాయి.