: కేసీఆర్ పాలనలో హిందువులకు తీరని అన్యాయం: వీహెచ్ పీ చీఫ్ తొగాడియా ఫైర్
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ హిందువుల వ్యతిరేకి అంటూ కుండ బద్దలు కొట్టారు. టీఆర్ఎస్ పాలనలో హిందువులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఓట్ల కోసం ముస్లింలకు వలవేసేందుకు కేసీఆర్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని... అలాంటప్పుడు, ముస్లింలకు కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లను ఎలా కల్పిస్తారని నిలదీశారు. రాజకీయ స్వలాభం కోసం హిందువులకు అన్యాయం చేస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిజాం పరిపాలనలో హైదరాబాద్ ఎలా ఉందో... ప్రస్తుతం అలానే తయారైందని తొగాడియా విమర్శించారు. గతంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశామో... ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై అలానే పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. హజ్ యాత్రకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం... హిందువులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మక్కాకు హిందువులను అనుమతించరని... అలాంటప్పుడు పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారం ఎలా చేస్తారని అన్నారు.