: ఆత్మహత్య చేసుకున్న స్నేహితురాలు పిలుస్తోందంటూ, తనువు చాలించిన బాలిక
"అమ్మా... చనిపోయిన నా స్నేహితురాలు మమత నన్ను రోజూ రమ్మని పిలుస్తోంది. లేకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తోంది. ప్రతి అమావాస్యకూ నన్ను చెరువులోకి తీసుకెళ్లి, నాకు తోడు ఎవరూ లేరు, నాతో వచ్చేయ్ లేకపోతే అందర్నీ చంపేస్తా అంటూ బెదిరిస్తోంది. అందుకే నేను మమత వద్దకు వెళ్లిపోతున్నా బాయ్.. బాయ్.. నాకోసం బాధపడవద్దు. నాన్నకు, అన్నకు చెప్పండి" అని కల్పన (15) అనే బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలోని ప్రకాశం కాలనీలో జరిగింది. కాగా, ఇదే కాలనీకి చెందిన మమత అనే విద్యార్థిని ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. మమత, కల్పనలు ప్రాణ స్నేహితులుగా కలసి ఉండేవారు. మమత మరణించిన నాటి నుంచి కల్పనకు నిత్యం ఆమె కలలో కనిపిస్తుండేదనీ, తనవద్దకు రాకపోతే అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నట్టు కల్పన చెబుతుండేది. మానసిక వేదన ఎక్కువ కావడంతోనే కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని, కేసును నమోదుచేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.