: బాలల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం అంకితం: కైలాష్ సత్యార్థి
బుద్ధుడు, గురు గోవింద్ సింగ్, గాంధీల స్ఫూర్తితో నడుస్తున్నానని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి తెలిపారు. నోబెల్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఓస్లోలో ఆయన మాట్లాడుతూ, మనం యుద్ధాల కోసం, దేశ భద్రతకోసం ఖర్చు పెడుతున్న దానిలో ఒక్క శాతం ఖర్చు చేస్తే, పరిపూర్ణమైన యువకులు తయారవుతారని అన్నారు. ప్రతి బాలుడు, బాలిక స్వేచ్ఛగా ఆడాలి, చదవాలి, పాడాలి, నిద్రపోవాలి అని ఆయన ఆకాంక్షించారు. బాలలకు భవిష్యత్ పై భయం లేకుండా వారిని పెంచాలని ఆయన సూచించారు. మనం బాల కార్మికులను, బాల బాధితులను గణనీయంగా తగ్గించగలిగితే సమర్ధవంతమైన ప్రపంచాన్ని తయారు చేయగలమని ఆయన అన్నారు. బాలలకు విద్యను సమర్ధవంతంగా అందించాలని ఆయన సూచించారు. బాలల హక్కులపై ప్రపంచం మొత్తం ఒకతాటిపై నడవాలని ఆయన కోరారు. అమాయక బాలలకు తాను ప్రతినిధినని ఆయన పేర్కొన్నారు. బాల్యాన్ని, బాలల కలలను ఛిద్రం చేసే అధికారం మనకు లేదని ఆయన స్పష్టం చేశారు. బాలల కోసం ప్రపంచం మొత్తం ఒకేలా ఆలోచించి, ఆచరించాలని ఆయన కోరారు. బాలల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ నోబెల్ పురస్కారం అంకితమని ఆయన తెలిపారు. నోబెల్ పురస్కారానికి ముందు సత్యార్థి భగవద్గీతలోని ఓ శ్లోకం చెప్పి ప్రసంగం ప్రారంభిచారు.