: 'స్వచ్ఛ భారత్' ఇలా కూడా చేయొచ్చా?


భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పరిశుభ్ర భారత్ గా మార్చే ఉద్దేశంతో చేపట్టిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు తమ చిత్తానికి నిర్వహించి అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో మూడు రోజుల పాటు 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశించింది. దీంతో, అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానంలో అధికారులు 'స్వచ్ఛ భారత్' ను చేపట్టారు. దీనికి అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని ఆహ్వానించారు. పవిత్రమైన దేవుని సన్నిధానాన్ని యథా ప్రకారం ఆలయ సిబ్బంది ఉదయమే శుభ్రం చేశారు. ప్రజా ప్రతినిధులు తమకు అలవాటైన రీతిలో పంక్చువాలిటీ(!) పాటించి ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆలయం పరిశుభ్రంగా ఉండడంతో 'స్వచ్ఛ భారత్' ఎలా చేయాలన్న సందేహం వచ్చింది. వెంటనే బయటి నుంచి ఆకులు, చెత్త తెప్పించి క్షణాల్లో ఆలయం ఆవరణలో చెల్లాచెదురుగా విసిరేయించారు. తరువాత, స్వేదం చిందేలా శుభ్రపరిచిన వారిలా ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చీపుర్లు పట్టుకుని 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్నట్టు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇలా ఉంటే దేశంలో 'స్వచ్ఛ భారత్' సాధ్యమేనా? అని స్థానికులు నవ్వుకున్నారు.

  • Loading...

More Telugu News