: విమానం కాస్తా మెటర్నిటీ వార్డుగా మారిన వేళ!
సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం కాస్తా మెటర్నిటీ వార్డుగా మారిపోయింది! ఫీనిక్స్ వెళ్లాల్సిన ఆ విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ ప్రయాణికురాలికి ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, విమానాన్ని లాస్ ఏంజెలిస్ కు మళ్లించారు. ఆ విమానంలోని సిబ్బంది, ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్, నర్సు ఆమెకు కాన్పు విషయంలో సాయపడ్డారు. ఎలాంటి సమస్య లేకుండా ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. "కేర్" మని బిడ్డ ఏడుపు వినిపించగానే "కొత్త వ్యక్తికి స్వాగతం" అంటూ ఫ్లైట్ కెప్టెన్ మైక్ లో పేర్కొన్నాడు. లాస్ ఏంజెలిస్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండయ్యాక తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక విభాగం ప్రతినిధి ఎరిక్ స్కాట్ తెలిపారు.