: ఇంటరాగేషన్ పేరిట సీఐఏ క్రూరం... దిగ్భ్రాంతి కలిగిస్తున్న సెనేట్ నివేదిక
ఉగ్రవాదుల నుంచి నిజాలు చెప్పించడం కోసం అమెరికా సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అధికారులు అత్యంత క్రూరమైన, నీచమైన, ప్రాణంతకమైన పద్ధతులను వాడారట. అధ్యక్షుడు సహా వైట్ హౌస్ వర్గాలకుగాని, ప్రజా ప్రతినిధులకుగాని ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా ఉగ్ర అనుమానితులను తీవ్రంగా హింసించారని సెనేట్ కమిటీ ఓ నివేదికను విడుదల చేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై దాడుల అనంతరం అధ్యక్షుడు బుష్ కు సైతం తెలియకుండా ఎంతో మందిని హింసించారని, అందుకు హేయమైన పద్దతులు వాడారని సెనేట్ తెలిపింది. అబూ జుబైదా, ఖలీద్ షేక్ మహమ్మద్ అనే ఉగ్ర ఖైదీలపై 'వాటర్ బోర్డింగ్' పద్ధతిని వాడారని వివరించింది. మొత్తం 119 మందిని ఇంటరాగేట్ చేసిందని, వారిలో 29 మంది వరకు నిరపరాధులని తెలిపింది. 'వాటర్ బోర్డింగ్' హింసా పద్ధతిని వివరిస్తూ, నిందితుడిని వారం, పది రోజుల పాటు మత్తు ద్వారా నిద్రలో ఉంచి ఆపై హింసను మొదలు పెడతారని, పైకి కనిపించని ఈ విధానంలో తాను నీటిలో మునిగిపోతున్న అనుభూతిని పొందే నిందితుడు ఒక్కోసారి అకస్మాత్తుగా మరణించే ప్రమాదముందని పేర్కొంది. కాళ్ళు, చేతులు కదలకుండా చేసి, ముఖంపై ఓ పలుచటి గుడ్డను ఉంచి ముక్కు రంద్రాల గుండా నీటిని పోసే ఈ విధానంలో మెదడు, ఊపిరితిత్తులలోకి నీరు చేరుతుందని, ఈ రకం హింస అత్యంత క్రూరమైనదని అభిప్రాయపడింది. మరికొన్ని సార్లు అనుమానితుల మల ద్వారం గుండా నీటిని పంపి హింసించారని 6 వేల పేజీల సెనేట్ నివేదిక తెలిపింది. సీఐఏ ఇంటరాగేషన్ తరువాత నిందితులు ఓ చిన్న బోనులో ఉంచిన కుక్కల్లాగా కనిపించేవారని, ఏం చెబితే అది చేసే పరిస్థితికి వచ్చారని వివరించింది. సీఐఏ క్రూరత్వంపై ప్రస్తుతం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.