: తెలంగాణలో నేటి నుంచి రెండో విడత ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆసరా పింఛన్లలో భాగంగా తెలంగాణలో నేటి నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభం కానుంది. గత నెలలో ఆసరా పింఛన్ల పంపిణీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే పలు జిల్లాల పరిధిలో తలెత్తిన సాఫ్ట్ వేర్ లోపాల కారణంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. అర్హత ఉన్నా, తమకు పింఛన్ అందలేదని బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. వీరికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాజాగా సాఫ్ట్ వేర్ లోపాలను సవరించిన అధికారులు రెండో విడత ఆసరా పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) భారీ ఏర్పాట్లు చేసింది. పింఛన్ కు అర్హత సాధించిన వారికి ఈ విడతలో డిసెంబర్ నెలతో పాటు నవంబర్ నెల పింఛన్ కూడా అందనుంది. ఇందుకోసం దాదాపు రూ.613.5 కోట్లు అవసరం కానుండగా, ఇప్పటికే రూ.453 కోట్ల నిధులను ఆయా జిల్లాలకు చేరవేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన నిధులు కూడా రెండు, మూడు రోజుల్లోగా జిల్లాలకు చేరనున్నాయని ప్రకటించింది. ఆసరా పింఛన్ల కోసం మొత్తం 39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 25 లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.