: తిరుమల వెంకన్నను దర్శించుకున్న లంక అధ్యక్షుడు రాజపక్స
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స కొద్దిసేపటి క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నేటి ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆయనకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు స్వామి వారి దర్శనాన్ని కల్పించడంతో పాటు వేంకటేశుడి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలోని శ్రీకృష్ణ అతిధి గృహంలో బస చేసిన రాజపక్స తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. తమిళుల నిరసనల నేపథ్యంలో తిరుమలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాక తిరుమలలో పోలీసులు ఆంక్షలను అమలుచేశారు. 7.15 గంటలకు రాజపక్స తిరుమల నుంచి లంకకు బయలుదేరనున్నారు. రోడ్డు మార్గం మీదుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో కొలంబో బయలుదేరుతారు.