: ముషీరాబాద్, బోలక్ పూర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు
హైదరాబాదులోని ముషీరాబాద్, బోలక్ పూర్ లను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. హైదరాబాదులో నేరచరితుల ఆటకట్టించేందుకు గత కొంత కాలంగా పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇలా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రతిసారీ పదులు సంఖ్యలో నేరగాళ్లు, రౌడీ షీటర్లు, పోలీసు కేసులను తప్పించుకు తిరుగుతున్న కరడుగట్టిన నేరగాళ్లు పట్టుబడుతున్నారు. తాజాగా బోలక్ పూర్ లో నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో సరైన పత్రాలు లేని 43 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 మంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ లో ఆరు బృందాలతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు అక్కడ కూడా పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.