: పాక్ చిన్నారికి మన వైద్యులు 'ముఖ'మిచ్చారు!
పసివారిలో దేవుడ్ని చూడాలంటారు పెద్దలు. అలాగే వైద్యుడ్ని దేవుడితో పోలుస్తారు. అందుకేనేమో ఆ పిల్లాడి పాలిట వైద్యులు దేవుడి పాత్ర పోషించారు. పాకిస్థాన్ కు చెందిన హర్షద్ అలీ, రజియా అనే దంపతులకు నోమన్ (18 నెలలు) అనే కుమారుడున్నాడు. నోమన్ కు ముఖ భాగంలోని కళ్లు, నోరు వద్ద కండరాలు ఛిద్రమై కనీసం ఆహారం తీసుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో జన్మించాడు. దీంతో ఆ దంపతులు తమ కుమారుడ్ని వివిధ వైద్యశాలలకు తిప్పారు. అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న నోమన్ కు చికిత్స చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో చెన్నైలోని బాలాజీ డెంటల్, క్రానియోఫేషియల్ ఆసుపత్రి గురించి తెలుసుకుని చెన్నై తీసుకువచ్చారు. బాలుడి అవస్థ గమనించిన డాక్టర్ బాలాజీ, తన వైద్య బృందంతో నోమన్ కి డాక్రిసిస్టోహిస్టానమీ (డీసీఆర్) విధానం ద్వారా శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు నోమన్ ముఖం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ఉన్నాడు. దీని పట్ల అతని తల్లిదండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.