: తొలి టెస్టు తొలి రోజు ఆట సమాప్తం... ఆసిస్ స్కోరు 354/6
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. మొత్తం 89.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు వచ్చీ రాగానే దూకుడు ప్రదర్శించింది. అయితే ఆదిలోనే తొలి వికెట్ ను పడగొట్టిన ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ లో పదో శతకాన్ని నమోదు చేశాడు. 145 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ పెవిలియన్ చేరాడు. మైఖేల్ క్లార్క్ (60), స్టీవ్ స్మిత్ (72)లు రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించగలిగింది. వార్నర్ క్రీజులో ఉన్నంతవరకు ఆసీస్ వికెట్లను కూల్చడంతో ఇబ్బందిపడ్డ టీమిండియా బౌలర్లు అతడు వెనుదిరిగిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను పడగొట్టారు. భారత బౌలర్లలో మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, కరణ్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఆటలో సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.