: మా వాటాలో అమ్మింది కొంత భాగమే: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు నారాయణమూర్తి, నందన్ నీలేకని, ఎన్.డి.శిబులాల్, కె.దినేశ్ లు ఆశ్చర్యకరంగా ఒక బిలియన్ డాలర్ల విలువ (రూ.6,484 కోట్ల) చేసే షేర్లను మూకుమ్మడిగా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై భారీగా ప్రభావం చూపడం, ఇన్ఫోసిస్ షేరు విలువ భారీగా పతనమవడం తెలిసిందే. అయితే, తమ కుటుంబం వాటాలో కొంత భాగాన్నే అమ్మినట్టు నారాయణమూర్తి తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం, దాతృత్వ కార్యకలాపాలకు, ఇతరత్రా అవసరాల కోసం వాటాను అమ్ముకున్నామని చెప్పారు. తన తదుపరి జీవితాన్ని ఉత్సాహవంతంగా, ఊపిరిసలపకుండా గడపడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. విక్రయం తరువాత కూడా తమ వాటానే రిటైల్ మదుపర్లలో అతిపెద్ద వాటాదారుగా ఉండబోతుందన్నారు. ఇన్ఫోసిస్, ఆ కంపెనీ నాయకత్వానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని తాను విశ్వసిస్తున్నానన్నారు. అటు ఈ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా స్వాగతించారు.