: చెన్నైలో రూ.20 కోట్లతో శ్రీవారి ఆలయం
తమిళనాడు రాజధాని చెన్నైలో తిరుమల శ్రీవారికి టీటీడీ ఆలయాన్ని నిర్మించబోతోంది. రూ.20 కోట్లకు పైగా వ్యయంతో ఈ అతి పెద్ద ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ మొత్తాన్ని మలేసియాకు చెందిన ఒక భక్తుడు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని టీ నగర్ లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రంలో చిన్న ఆలయం ఉంది. గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి రూ.50 కోట్ల రాబడి వచ్చింది. రద్దీగా ఉండే టీ నగర్ లో నెలకొల్పిన ఈ ఆలయం నిత్యం వేలమంది భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ తలంచింది. ఇందుకోసం స్థలాలను దేవస్ధానం పరిశీలించింది. గతంలో సినీ నటి కాంచన, ఆమె సోదరి, తల్లి శ్రీవారికి కానుకగా ఇచ్చిన చెన్నైలోని జీఎన్ చెట్టి రోడ్డులో విలువైన, విశాలమైన 14,400 చదరపు అడుగుల స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని తాజాగా నిర్ణయించారు.