: కృష్ణా పత్రిక సంపాదకుడు పిరాట్ల కన్నుమూత


తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటైన కృష్ణా పత్రిక సంపాదకుడు పిరాట్ల వెంకటేశ్వర్లు నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన సంఘసంస్కర్తగా, పాత్రికేయుడిగా విశేష సేవలందించారు. ఆయన భార్య సూర్యకుమారి, ఏకైక కుమారుడు కృష్ణ కిశోర్‌ కూడా కృష్ణా పత్రికలో పనిచేస్తున్నారు. 1902లో ముట్నూరు కృష్ణారావు ప్రారంభించిన కృష్ణా పత్రిక, తదనంతర కాలంలో మూతబడగా, 1983లో పత్రికను పిరాట్ల పునరుద్ధరించారు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పూర్వవైభవానికి తనవంతు కృషి చేశారు. అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన రచించిన ‘రెడ్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా’ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ఇందిరాగాంధీ సద్భావనా అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో నేటి మధ్యాహ్నం పిరాట్ల అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, పిరాట్ల మృతి విషయం తెలుసుకున్న పలువురు జర్నలిస్ట్ లు నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తమ సంతాపాన్ని తెలిపారు.

  • Loading...

More Telugu News