: చంద్రబాబుతో లడాయేమీ లేదుగా: కేసీఆర్, ఉమాభారతిల మధ్య ఆసక్తికర చర్చ
తెలంగాణ సీఎం, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిల మధ్య సోమవారం ఆసక్తికర చర్చ సాగింది. సోమవారం తనను కలిసేందుకు వచ్చిన కేసీఆర్ కు ఉమాభారతి రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికారు. కేసీఆర్ ను ఆత్మీయంగా పలుకరించిన ఉమాభారతి, ఆయన చేయి పట్టుకుని మరీ తన కార్యాలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన ఉమాభారతి, "చంద్రబాబుతో లడాయేమీ లేదుగా?" అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేసీఆర్, చంద్రబాబుతో తమకేమీ విభేదాలు లేవని బదులిచ్చారు. అంతేకాక సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సదస్సులో చంద్రబాబు, తాను పక్కపక్కనే కూర్చున్నామని చెప్పారు. సదస్సు విరామంలో ఇద్దరమూ కలిసే భోజనం చేశామని కూడా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రాణహిత ప్రాజెక్టుకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుమతులు సాధించడంతో పాటు నిధులనూ కేటాయించిన విషయాన్ని ఉమాభారతికి కేసీఆర్ గుర్తు చేశారు.