: పరిహారం ఇలా చెల్లిస్తాం... భూసేకరణపై బాబు విధాన ప్రకటన
రాజధాని భూసేకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విధాన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, భూ సేకరణ ఆలస్యం చేయాలని పార్టీలు భావించాయని అన్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో భూములను బట్టి రైతులను వర్గీకరించారు. మెట్ట, జరీబు అంటూ రెండు కేటగిరీలుగా రైతులను విభజించారు. మెట్ట, జరీబు భూములకు వేర్వేరుగా పరిహారం చెల్లించాలని నిర్ణయించినట్టు బాబు తెలిపారు. కృష్ణా తీరంలో జరీబు భూములున్నాయని ఆయన చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ తరువాత పట్టా కలిగిన రైతులకు చట్టబద్ధత రసీదు ఇస్తామని అన్నారు. భూసమీకరణలో భూములు కోల్పోయిన యజమానులకు ఓనర్ షిప్ సర్టిఫికేట్ ఇస్తామని ఆయన చెప్పారు. మెట్టప్రాంతాల్లో అసైన్డ్ భూములున్న వారికి 800 గజాల ఇంటి స్ధలం, 100 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామని ఆయన చెప్పారు. మెట్టప్రాంతంలో పట్టా భూములున్న రైతులకు 1000 గజాల నివాస స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం అందజేస్తామని ఆయన చెప్పారు. జరీబు ప్రాంతంలో పట్టాభూములున్న రైతులకు 1000 గజాల నివాస స్థలం, 300 కమర్షియల్ స్థలం... అసైన్డ్ భూములున్న వారికి 1000 గజాల నివాస స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం అందజేయనున్నామని ఆయన వెల్లడించారు. భూసమీకరణకు అంగీకరించిన రైతులు, కౌలు దార్లు, రైతు కూలీలు అందరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబుల్, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.