: జాగ్రత్త... మీరు కింద పడితే... నన్ను నిందిస్తారు: మోదీ
జమ్మూలోని సాంబాలో ప్రధాని మోదీ ఎన్నికల సభ కొనసాగుతోంది. మోదీ సభకు జనం పోటెత్తారు. కొంత మంది చెట్లు ఎక్కి ప్రసంగం వింటున్నారు. వీరిని ఉద్దేశించి మాట్లాడుతూ, "చెట్ల మీదున్న వారు జాగ్రత్త. మీరు కింద పడితే ఆ వార్త మీడియాలో వస్తుంది. నన్ను నిందిస్తారు" అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికల సభలకు ఇంతమంది రావడం, ప్రసంగాలకు స్పందించడాన్ని నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని... లేకపోతే, మన సైనికుల మాదిరి మీరు కూడా ఉగ్రవాదుల దాడులకు గురయ్యే ప్రమాదం ఉందనీ అన్నారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని చెప్పారు. బీజేపీకి పట్టం కట్టాలని... హంగ్ అసెంబ్లీ రాకుండా చూడాలని ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు. మీ ఓటు విలువను అభివృద్ధి అనే వడ్డీ సహా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, వ్యవసాయ భూములకు సాగు నీరు, ఆహారం అందించే బాధ్యత తనదని చెప్పారు. బుల్లెట్ కి బ్యాలెట్ తో సమాధానం చెప్పాలని అన్నారు. ఏకే47 ట్రిగ్రర్ నొక్కితే చావుకు కారణమవుతుందని... కానీ, ఈవీఎం మీద బటన్ నొక్కితే రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని చెప్పారు.