: రజనీ రాజకీయాల్లో ఇమడలేడంటున్న సోదరుడు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎన్నాళ్ల నుంచో చర్చనీయాంశంగా ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీలు, అభిమానులు కోరుతున్నారు. దీనిపై రజనీ ఎటూ తేల్చడం లేదు. అంతా దైవానుగ్రహం అంటూ దాటవేస్తున్నారు. తాజాగా, ఈ అంశంపై రజనీ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజనీ రాజకీయాల్లో ఇమడలేడని, అతనిపై ఒత్తిడి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. రజనీ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుచ్చి ఆలయంలో అభిమానులు తయారు చేయిస్తున్న వెండి రథం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, రాజకీయం అంటేనే మోసమని, నేతల మనస్తత్వం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుందని అన్నారు. తమిళ రాజకీయ నేతలంతా అవకాశవాదులేనని ఈ సందర్భంగా విమర్శించారు. రజనీ తాజా చిత్రం 'లింగ' సూపర్ హిట్ అవుతుందని అన్నారు.