: తొలి టెస్టుకు నేనే కెప్టెన్: కోహ్లీ
అడిలైడ్ లో మంగళవారం మొదలయ్యే తొలి టెస్టులో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని కోహ్లీనే వెల్లడించాడు. సోమవారం అడిలైడ్ ఓవల్ క్రికెట్ మైదానంలో మీడియాతో మాట్లాడుతూ, మొదటి టెస్టులో ధోనీ ఆడడం లేదని, తానే కెప్టెన్ గా వ్యవహరిస్తానని తెలిపాడు. చేతిగాయం నుంచి మరికొన్ని రోజుల్లో ధోనీ పూర్తిగా కోలుకుంటాడని భావిస్తున్నామని చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు ఇది మధురానుభూతి అని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ ఆడాలని ఎల్లప్పుడూ కలలు కనేవాడినని, ఇప్పుడు ఓ టెస్టు మ్యాచ్ లో భారత్ కు నాయకత్వం వహిస్తున్నానని అన్నాడు. అటు, ఆస్ట్రేలియా జట్టుకు మైకేల్ క్లార్క్ సారథ్యం వహించనున్నాడు. క్లార్క్ సన్నద్ధతపై సందేహాలు తొలగిపోయాయి. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశానికి క్లార్క్ హాజరుకాలేదు. క్లార్క్ బదులు పేసర్ మిచెల్ జాన్సన్ హాజరయ్యాడు. క్లార్క్ తొలి టెస్టులో ఆడే విషయాన్ని నిర్ధారించాడు. "క్లార్క్ పునరాగమనం మాకు అమితంగా లాభించే అంశం. ఈ కఠినమైన సిరీస్ లో జట్టుకు అతని సేవలు అవసరం" అని పేర్కొన్నాడు.