: టీవీ చర్చా కార్యక్రమంలో కొట్టుకున్నారు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య స్పర్థ తీవ్రస్థాయిలో రాజుకుంది. మరోసారి తామే ఢిల్లీ పీఠం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, మోదీ ప్రభంజనంతో హస్తినను ఊడ్చిపారేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో పార్టీలు వాతావరణాన్ని వేడిక్కిస్తున్నాయి. తాజాగా, ఓ టీవీ చానల్ ఈ రెండు పార్టీల కార్యకర్తలతో ఓ బహిరంగ చర్చ నిర్వహించింది. అయితే, చర్చను మధ్యలోనే వదిలేసి ఇరువర్గాలు ముష్టియుద్ధానికి దిగాయి. తొలుత, బీజేపీ కార్యకర్త ఆమ్ ఆద్మీ మద్దతుదారుడిని కొట్టడంతో ఘర్షణ మొదలైంది. కాసేపటికి ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. బీజేపీ నేత మోహన్ సింగ్ బిస్త్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కపిల్ మిశ్రాను బెదిరించారు. గాయపడిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కరవాల్ నగర్ పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ ప్రతినిధి దుర్గేశ్ పాఠక్ మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన వారెవరూ దాడి చేయలేదని, బీజేపీనే దుందుడుకుగా వ్యవహరించిందని చెప్పారు.