: ప్రణాళిక సంఘ సంస్కరణలపై కాంగ్రెస్ మండిపాటు
ప్రణాళిక సంఘం స్థానంలో నూతన వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం యత్నిస్తుండడంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రణాళిక సంఘాన్ని తొలగించడం అసమంజసమైన నిర్ణయం అవుతుందని పేర్కొంది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అది ఎంతో ప్రమాదకరమని అభిప్రాయపడింది. దీర్ఘకాలంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ విశ్లేషించింది. ప్రస్తుతం కావాల్సింది ప్రణాళిక సంఘాన్ని నవీకరించడమే కానీ, పేరు మార్చడమో, లేక, దాన్ని 'రాజకీయ ఖననం' చేయడమో కాదని పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం నిర్ణయం హ్రస్వదృష్టితో తీసుకున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. తమ చర్య రాష్ట్రాలకు సాధికారత తెచ్చిపెడుతుందని పీఎం చెప్పడం విచారకరమని అభిప్రాయపడ్డారు.