: పిన్న వయసు సీఈఓగా చెన్నై బాలిక రికార్డు
కేవలం 16 ఏళ్లకే సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన చెన్నై బాలిక సింధూజ రాజ్ రామన్, పిన్న వయసు సీఈఓగా రికార్డులకెక్కింది. తన తండ్రి స్థాపించిన సెప్పన్ అనే యానిమేషన్ కంపెనీకి ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితురాలైంది. దీంతో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ సర్వీస్ కంపెనీస్ సింధూజకు పిన్న వయసు సీఈఓగా గుర్తింపునిచ్చింది. కార్టూనిస్ట్ గా పనిచేస్తున్న తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను సీఈఓగా బాధ్యతలు చేపట్టగలిగానని ఆమె చెబుతోంది. భారత్ కు చెందిన ప్రఖ్యాత కంపెనీలకు సినిమాలు, వ్యాపార ప్రకటనలు రూపొందించే 18 మంది సభ్యుల బృందానికి ఆమె నేతృత్వం వహిస్తోంది. ప్రపంచంలోనే పిన్న వయసు డిజిటల్ క్యారికేచరిస్ట్ గా కోరల్ సంస్థ ఆమెను గుర్తించింది. ఇదివరకే నాస్కామ్ 2డీ యానిమేటర్ అవార్డును కూడా సింధూజ కైవసం చేసుకుంది. సొంతంగా సంస్థను నిర్మించి సినిమా ప్రోడక్ట్స్ ను విశ్వవ్యాప్తంగా అందించాలన్నది తన కోరిక అని ఆమె అంటోంది.