: అనంతలో ‘పరిటాల’ పేరిట బెదిరింపులు... ఇద్దరి అరెస్ట్
అనంతపురం జిల్లా హిందూపురంలో 'పరిటాల' అనుచరులమంటూ, చేనేత వ్యాపారులను బెదిరిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన ఆనంద్, రఘు చేనేత వ్యాపారం చేస్తుంటారు. డబ్బు కోసం వీరిని ఇద్దరు ఆకతాయిలు 20 రోజులుగా బెదిరిస్తూ వచ్చారు. తాము పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ అనుచరులమని, రూ.20 లక్షలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సోమందేపల్లి మండలం, బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన చాకలి మల్లికార్జున, చాలకూరు ప్రసాద్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాగా, పరిటాల కుటుంబం పేరుతో సెటిల్ మెంట్లు, డబ్బు డిమాండ్లకు పాల్పడితే తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సునీత పోలీసులను ఆదేశించారు.