: అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ నాశనం చేసింది: వెంకయ్య నాయుడు
పార్లమెంటు విలువలను, సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ మంటగలిపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. హైదరాబాదులో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొన్న వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నుంచి కింద స్థాయి వరకు ఉన్న అందరినీ విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది పెద్దలు మోదీ గురించి చేసిన విపరీత వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని వెంకయ్య మండిపడ్డారు. తమకేమి కావాలన్న విషయం కూడా ఆ పార్టీకి తెలియదని అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. కింద స్థాయి కుటుంబం నుంచి వచ్చిన ఓ పేద మహిళా ఎంపీ (సాధ్వి నిరంజన్ జ్యోతి) ఎన్నికల సభలో మాట్లాడిన మాటలను పట్టుకుని పార్లమెంటులో రభస చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.