: నిధులెక్కడి నుంచి వస్తున్నాయి?: కేజ్రీవాల్ ను నిలదీసిన ఆప్ మాజీ నేత బిన్నీ
‘‘అసలే ఏడాది వ్యవధిలో రెండోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. చచ్చీచెడీ తొలిసారి ఎన్నికలకు అవసరమైన నిధులను ఎలాగోలా రాబట్టాం. స్వయంకృతాపరాధంతో వచ్చిన అవకాశాన్ని దిగజార్చుకుని రెండోసారి ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోంది. నిధుల సమీకరణ సత్ఫలితాలివ్వడం లేదు. విదేశాలకైనా వెళ్లొద్దాం’’ అని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఇంటా, బయటా ఎదురీత తప్పడం లేదు. మొన్నటిదాకా కేజ్రీవాల్ ముఖ్య అనుచరుడిగా కొనసాగి ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినోద్ కుమార్ బిన్నీ తాజాగా కేజ్రీవాల్ వైఖరిపై ఆరోపణలు గుప్పించారు. నిధుల సమీకరణకు పార్టీ చేపట్టిన విందు రాజకీయాలు ఫలించలేదు, మరి నగరంలో వెలసిన హోర్డింగులకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ఆయన కేజ్రీవాల్ ను నిలదీశారు. అంతేకాక నిధుల కోసం విదేశీయానానికి సిద్ధపడ్డ కేజ్రీవాల్ నిర్ణయాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘ఢిల్లీలోని ప్రతి వీధిలో ఆప్ హోర్డింగ్ లు కనిపిస్తున్నాయి. ఒక్కో హోర్డింగుకు ఎంతలేదన్నా రూ. లక్ష నుంచి 1.5 లక్షల దాకా ఖర్చవుతోంది. మరి ఆ నిధులన్నీ ఏ మార్గాల్లో వస్తున్నాయి?’’ అంటూ బిన్నీ సంధించిన ప్రశ్నలకు కేజ్రీవాల్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.