: అప్పట్లో హీరోయిన్...మరి ఇప్పుడో?
సూపర్‌స్టార్ రజనీకాంత్ తో 'రాఘవేంద్ర', విశ్వనాయకుడు కమలహాసన్ తో 'టిక్ టిక్ టిక్' సినిమాల్లో నటించిన హీరోయిన్ దుస్థితి చూసి తమిళసినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. నటి నిషా ఎయిడ్స్ కోరల్లో చిక్కుకుని మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న ఫోటోలు ఇటీవల వాట్సాప్, సామాజిక వెబ్ సైట్ లలో ప్రచారం అయ్యాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అస్థిపంజరం లాంటి దేహంతో నాబూర్ దర్గా సమీపంలో వారం రోజులుగా అనాథగా పడి వున్న నటి నిషాను పట్టించుకున్న నాధుడు లేకుండా పోయారు. కాగా, ఆ దుస్థితిలో ఆమె శరీరం నిండా చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం సినిమాలో కథానాయికగా ప్రకాశించిన నటి నిషా దయనీయ స్థితిని తెలియజేస్తూ, ఫోటోలతో ఒక మెస్సేజ్ జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు న్యాయమూర్తి మురుగేశన్ కు అందింది. ఆ దృశ్యాలు ఆయన మనసును కలచి వేశాయి. వెంటనే ఆయన స్పందించారు. నిషాకు వెంటనే వైద్య చికిత్స ఏర్పాటు చేయాల్సిందిగా నాగపట్టణం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ లను ఆదేశించారు. ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.