: 'రోహ్ తక్ సిస్టర్స్' కు నగదు బహుమతిని నిలిపివేసిన హర్యానా ప్రభుత్వం


అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ పూజా, ఆర్తీలకు ప్రకటించిన నగదు పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్కాచెల్లెళ్ళ ప్రవర్తనపై పలు సందేహాలు ఉన్నాయని, తమకు కొట్టడం అలవాటని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారని, వీరు చెబుతున్న విషయాల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేంత వరకూ బహుమతి నిలిపివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తొలుత, ఒక బస్సులో ముగ్గురు యువకులను వీరు ఎదుర్కొంటున్న వీడియో నెట్ లో హల్ చల్ చేయగా, ఆ వెంటనే మరో వీడియో కూడా బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలలో వీడియోను ఎవరు షూట్ చేశారన్న విషయాన్ని ఇంతవరకూ పోలీసులు కనుక్కోలేకపోయారు. వీరు యువకులకు బుద్ధి చెబుతున్న సన్నివేశాలను చిత్రీకరించినవారు అంతకు కొద్ది క్షణాల ముందు జరిగిన వేధింపులను ఎందుకు షూట్ చేయలేదని ఎంతో మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో ప్రశ్నలు కురిపించారు. కాగా, బస్సులో పోకిరీలుగా ముద్రపడి ఉద్యోగార్హత కోల్పోయిన ముగ్గురు యువకులూ మంచివారని వారి స్వగ్రామం వెనకేసుకొచ్చింది. పైగా, బస్సులో తీసిన వీడియోలో కనిపించిన ఓ పెద్దావిడ వారు ఎవరినీ వేధించలేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పూజా, ఆర్తీలకు తగిన సహకారం అందించలేదంటూ సస్పెన్షన్ కు గురైన బస్సు డ్రైవర్ ను విధుల్లో చేరమని అధికారులు ఆదేశించారు. ఈ అక్కాచెల్లెళ్ళ గురించి ఇంకేమి వినాల్సి వస్తుందో?

  • Loading...

More Telugu News