: ఎక్కడాలేని విధంగా రుణమాఫీ అమలు... మాఫీ తేది డిసెంబర్ 10: చంద్రబాబు


రూ. 50 వేల లోపు రుణాలున్న రైతులకు ఈ నెల 10వ తేదీన రుణమాఫీ జరుగుతుందని, ఆ తరువాత ఏ బ్యాంకు కూడా వారిని రుణం చెల్లించాలని అడగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునే దిశగా ఎన్ని కష్టాలు ఎదురైనా అర్హులైన అందరికీ రుణమాఫీ అమలు చేసి తీరుతామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర మంత్రులతో నేటి ఉదయం సమావేశం అనంతరం రుణమాఫీపై ఆయన విధాన ప్రకటన చేశారు. గత పదేళ్లుగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అర్హులైన ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తున్నామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న రైతులందరికీ రుణాలు మాఫీ అయినట్టేనని వివరించారు. ఆధార్, రేషన్ కార్డులు సమర్పించని వారికి 4 వారాల గడువు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఒకే వ్యక్తి పలు చోట్ల రుణమాఫీకి దరఖాస్తు చేసుకోరాదనే నిబంధనలు కొంత కఠినం చేశామని బాబు పేర్కొన్నారు. ఒక కుటుంబానికి రూ. 1.50 లక్షల రూపాయల సీలింగ్ విధించినట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశామని వివరించారు.

  • Loading...

More Telugu News