: జ్యోతిష్యం ముందు సైన్స్ మరుగుజ్జే: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య
ఇప్పటికే కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇంటా బయటా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న బీజేపీ మరో వివాదం సుడిలో చిక్కుకుంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభ లో ఆ పార్టీ ఎంపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ ఈ వివాదాన్ని రేపారు. సైన్స్ ను జ్యోతిష్య శాస్త్రంతో పోల్చిన ఆయన, జ్యోతిష్యం ముందు సైన్స్ మరుగుజ్జు లాంటిదని వ్యాఖ్యానించారు. పాఠశాల ప్రణాళిక, వాస్తు శాస్త్రానికి మరింత దన్ను ఇవ్వాలన్న బిల్లుకు లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న రమేశ్ ‘‘అణ్వస్త్ర పరీక్షల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అయితే లక్షల ఏళ్ల క్రితమే కణ్వ మహర్షి అణ్వస్త్ర పరీక్షలు చేశారు. పురాతన జ్యోతిష్యుల ముందు ఆధునిక సాంకేతికత ఏమాత్రం సాటి రాదు. ప్రపంచం మొత్తంలో జ్యోతిష్యానిదే అగ్రస్థానం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సహా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు భగ్గుమన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళుతున్న భారత్ ను ఈ వ్యాఖ్యలు కించపరచేవేనని ఆరోపించాయి. మరో అడుగు ముందుకేసిన తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ ‘‘మంత్రి స్మృతి ఇరానీ గంటల తరబడి జ్యోతిష్యుల వద్ద కూర్చుని జాతకాలు చెప్పించుకోవడం చెడు సంకేతాలను పంపిస్తుంది’’ అని మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.