: క్షమాపణ చెప్పినా రచ్చ చేయడం సరికాదు: రాజ్యసభలో ప్రధాని మోదీ
వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి క్షమాపణలు చెప్పినా ఆందోళన కొనసాగించడం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సాధ్వి క్షమాపణలు చెప్పారు. ఉభయ సభలనూ ఆమె క్షమాపణలు కోరారు. క్షమాపణలు చెప్పినా సభను అడ్డుకోవడం సరికాదు’’ అని మోదీ ప్రకటించారు. సాధ్వి వ్యాఖ్యలపై విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో గురువారం రాజ్యసభకు వచ్చిన మోదీ ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. దీనిపై మరింత రాద్ధాంతం చేయడం సబబు కాదని ఆయన విపక్ష సభ్యులకు సూచించారు. అయినా శాంతించని విపక్షాలపై రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సాధ్వి రాజీనామాకు పట్టుబట్టిన విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో, సాధ్వి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.