: కేంద్ర మంత్రి సాధ్విపై పోలీసు కేసు నమోదు


వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతిపై ఢిల్లీ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పశ్చిమ ఢిల్లీకి చెందిన న్యాయవాది రాజీవ్ కుమార్ భోలా బుధవారం సాయంత్రం తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మంత్రిపై పోలీసులు ఐపీసీ 500, 295, 153 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘‘మన రాజకీయ నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పెరిగిపోతోంది. ఇలాంటి ఉదంతాలపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదు. ఈ తరహా వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నాయి. ఈ కారణంగా మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’’ అని రాజీవ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీలో త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసనల నేపథ్యంలో సాధ్వి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్విని కేబినెట్ నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News