: ఈ పేపర్ పై ముద్రించేందుకు ఇంకు అక్కర్లేదు... 20 సార్లు చెరుపుకోవచ్చు!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పేపర్ ను ఆవిష్కరించారు. ఈ పేపర్ పై 20 సార్లు చెరిపేసి ముద్రించుకోవచ్చు. అలాగే దీనిపై ప్రింటింగ్ కు ఇంకు కూడా అక్కర్లేదు. మరి ఎలా అనేగా అనుమానం. రెడాక్స్ డైస్ అనే రసాయనానికి రంగులు మార్చుకునే లక్షణం ఉంటుంది. రెడాక్స్ డైస్ తో రూపొందించిన కాగితంపై రంగులు పొరల్లా ఏర్పడతాయి. వీటికి అతినీలలోహిత కిరణాలతో ఫొటో బ్లీచింగ్ చేస్తారు. ఈ తరహా టెక్నాలజీతో రూపొందిన పేపర్ మీద 20 సార్లు చెరిపేసి మళ్లీమళ్లీ ముద్రించుకోవచ్చు. అలా చెరపడం వల్ల దాని క్లారిటీపై ఎలాంటి ప్రభావం పడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ఆర్ధికంగా, పర్యావరణ పరంగా ఎంతో ఉపయోగం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.