: సినిమాల్లో 'ఐటెం సాంగ్స్' చేసే వారిని వేశ్యలుగా ప్రకటించండి: హిందూ మహాసభ
ఐటెంసాంగ్స్ లో నర్తించే వారిని వేశ్యలుగా ప్రకటించాలని భారత్ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని జింద్ లో ఆయన మాట్లాడుతూ, వీలైనంత తక్కువ దుస్తులు ధరించి ఒళ్లంతా కనిపించేలా నర్తించే ఐటెంగాల్స్, హీరోయిన్స్ ను సుప్రీంకోర్టు వేశ్యలుగా ప్రకటించాలని అన్నారు. తద్వారా ఐటెంగాల్స్ ని సమాజం కూడా బహిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. చిట్టిపొట్టి బట్టలేసుకుని తైతక్కలాడడం వల్ల, సినిమాల్లో చూపిస్తున్న పెడధోరణుల వల్లే మహిళలపై ఘోరాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, కాలేజీకెళ్లే ఆడపిల్లలకు డ్రెస్ కోడ్ ఉండాలని, సెల్ ఫోన్ల వాడకం నిషేధించాలని నిన్న అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమాల్లో ఐటెంసాంగ్స్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఐటెంసాంగ్ లేకుంటే సినిమాకి కిక్ రాదని, సినిమాలో సందర్భం ఉన్నా లేకున్నా ఐటెంసాంగ్ మాత్రం ఉండాల్సిందేనని సినీ నిర్మాతల అభిప్రాయం. ఈ మధ్య కాలంలో ఐటెంసాంగ్స్ ను హీరోయిన్లే చేస్తుండడం విశేషం. త్యాగి తాజా వ్యాఖ్యలపై సినీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.