: టైగర్ ఉడ్స్ తో కళ్లు చెదిరే ఒప్పందం కుదుర్చుకున్న హీరో మోటోకార్ప్
గోల్ఫ్ క్రీడకు విశేష ప్రాచుర్యం కల్పించిన ఆటగాళ్లలో అమెరికా జాతీయుడు టైగర్ ఉడ్స్ ముందు వరుసలో ఉంటాడు. ఎన్నో వరల్డ్ టైటిల్స్, ప్రైవేట్ టోర్నీలు నెగ్గి మరెవ్వరికీ సాధ్యంకాని రీతిలో పేరుప్రతిష్ఠలు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, గోల్ఫ్ ఆడితే వచ్చే పారితోషికం కంటే వాణిజ్య ఒప్పందాలతోనే వేల కోట్ల రూపాయలు ఖాతాలో వేసుకున్నాడు. ఇక, హీరో మోటోకార్ప్ విషయానికొస్తే... భారత్ లో నెంబర్ వన్ ద్విచక్రవాహన తయారీదారు. భారత్ లోనే కాకుండా, పలు దేశాల్లోనూ బైక్ ల అమ్మకాల్లో దూసుకెళుతోంది. హీరో మోటోకార్ప్ ఇప్పుడు టైగర్ ఉడ్స్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దాని విలువ రూ.250 కోట్లు (నాలుగేళ్లకు). ఓ భారత కంపెనీ క్రీడాకారులతో కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే. దీని ముందు టీమిండియా క్రికెటర్ల ఒప్పందాలు కూడా దిగదుడుపే. ధోనీ, కోహ్లీ వంటి టాప్ స్టార్లు ఏడాదికి ప్రకటనల రూపేణా రూ.4-10 కోట్లు మాత్రమే ఆర్జిస్తున్నారు. కాగా, టైగర్ ఉడ్స్ తో ఒప్పందంపై హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్ పవన్ ముంజాల్ అమెరికాలో వివరాలు తెలిపారు. "టైగర్ గోల్ఫ్ చాంపియన్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆదర్శప్రాయుడు. అతనో ఉత్పాతంలాంటి వాడు. వయసు, భాష, జాతీయత, భౌగోళిక హద్దులను చెరిపివేస్తూ అతని ప్రాభవం ఖండాంతరాలకు వ్యాపించింది" అని పేర్కొన్నారు. మున్ముందు ఫుట్ బాల్ క్రీడాకారులతో సహా ఇతర క్రీడలకు చెందిన స్టార్లతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు.