: ఈ నెల 5న భారీ ఉపగ్రహం జీశాట్-16ను ప్రయోగించనున్న ఇస్రో
భారీ ఉపగ్రహం జీశాట్-16 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సిద్ధమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. భారత కాలమానం ప్రకారం 5వ తేదీ ఉదయం 2.08 నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ఇప్పటి వరకు రెండు వేల కిలోలలోపు బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి పంపారు. ఈ నెల 5నాటి ప్రయోగంతో 3,181.60 కిలోల బరువున్న జీశాట్-16ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం కాలపరిమితి 12 ఏళ్లు. ప్రయోగానికి అవుతున్న ఖర్చు రూ. 865.50 కోట్లు. ఇందులో ఉపగ్రహం తయారీకి రూ. 400 కోట్లు ఖర్చు కాగా, మిగిలిన మొత్తాన్ని యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి ఇస్రో చెల్లిస్తోంది. ఏరియన్-5 ఈసీఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12కేయూ బాండ్స్ ట్రాన్స్ పాండర్స్, 24 సీ బాండ్, 12 ఎక్స్ టెండెడ్ సీబాండ్ ట్రాన్స్ పాండర్స్ ను అమర్చారు. 48 ట్రాన్స్ పాండర్లను ఒకేసారి నింగిలోకి పంపడం మన దేశ చరిత్రలో ఇదే ప్రథమం. బెంగళూరులో తయారు చేసిన జీశాట్-16 ఉపగ్రహాన్ని ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్ కు తరలించారు. మూడు టన్నుల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే టెక్నాలజీ మన దగ్గర లేకపోవడంతో... ఫ్రాన్స్ తో ఉన్న ఒప్పందాల మేరకు ఈ ప్రయోగాన్ని అక్కడి నుంచి ఇస్రో చేపడుతోంది.