: చర్చలు పునరుద్ధరించాల్సిన బాధ్యత భారత్ దే: పాక్
ద్వైపాక్షిక సంబంధాలపై భారత్ తో జరపాల్సిన చర్చల్లో పురోగతి ఉంటుందని ఊహించడం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అంటున్నారు. ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ వార్షిక సదస్సును ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ, "చర్చల ప్రక్రియను భారత్ సస్పెండ్ చేసింది. అందుకని దాన్ని పునఃప్రారంభించాల్సిన బాధ్యత కూడా వారిదే" అని పేర్కొన్నారు. అంతేగాక, కాశ్మీర్ వివాదంపై భారత ప్రభుత్వ వైఖరిపై ప్రస్తావించిన అజీజ్, తీవ్రవాదంతో కాశ్మీర్ ను ముడిపెట్టడం ద్వారా ప్రపంచదృష్టిని మరల్చాలని పొరుగుదేశం (భారత్) అనుకుంటోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే 40 ఏళ్లుగా కాశ్మీర్ పై ద్వైపాక్షిక చర్చలు విఫలమవుతూ వచ్చాయని చెప్పారు. అందుకే, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం కావాలని పాకిస్తాన్ కోరుకుంటోందని అజీజ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో హురియత్ నేత షబ్బీర్ షాను పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కలిసిన నేపథ్యంలో పాక్ తో విదేశీ కార్యదర్శి స్థాయి చర్చలను భారత్ విరమించుకుంది.