: పోలీసుల్ని పొట్టనబెట్టుకోవడంతోనే ఊరుకోలేదు... ఆయుధాలు ఎత్తుకెళ్లారు!


నిన్న ఛత్తీస్‌గఢ్‌ సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడిన మావోయిస్టులు వారిని పోట్టనబెట్టుకోవడంతోనే ఊరుకోలేదు. దాడి జరిపిన తరువాత జవానుల అత్యాధునిక ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 10 ఏకే-47, ఏకే-56 తుపాకులు, ఇతర ఆయుధాలు తీసుకెళ్లిపోయారు. వాటిలోని 3 ఏకే-47 తుపాకుల్లో అత్యాధునిక సదుపాయాలున్నాయి. వీటికి అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్స్ ఫిట్ చేసినట్టు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), ఐఎన్ ఎస్ఏఎస్ (ఇన్సాస్) రైఫిల్, 400 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని తెలిపింది. మావోయిస్టుల ఏరివేతకు వెళ్లిన జవాన్లలో చాలా మంది అడవిలోనే ఉన్నారని, మావోల దాడితో ప్రస్తుతానికి కూంబింగ్ తాత్కాలికంగా నిలిపివేశామని సీఆర్పీఎఫ్ ప్రకటించింది. తాజాగా దోచుకెళ్లిన ఆయుధాలతో మావోలు మరింత విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని సీఆర్పీఎఫ్ భావిస్తోంది. దీంతో, మరింత అప్రమత్తంగా ఉండడంతోపాటు, అదను చూసి దాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

  • Loading...

More Telugu News