: సెక్యూరిటీ ఆఫీసర్ తో జోక్ చేస్తే ఇలాగే ఉంటుంది!


అమెరికాలో ఓ వైద్యుడు చేయరాని చోట జోక్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. మాన్యుయేల్ అల్వరాడో (60) అనే డాక్టర్ బొగోటా వెళ్లేందుకు మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఏవియాంకా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఎక్కేముందు సెక్యూరిటీ చెకప్ కోసం లైన్లో నిలుచున్నాడు. అతని వంతు రాగానే, సెక్యూరిటీ అధికారి రొటీన్ ప్రశ్నలే అడిగాడు. ఎక్కడికెళుతున్నారు? లగేజిలో ఏముంది? అంటూ ప్రశ్నించాడు. దీనికా వైద్యుడు సరదాగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. తాను పేలుడు పదార్థాలు తీసుకెళుతున్నానంటూ జవాబిచ్చాడు. డాక్టర్ అల్వరాడో తాను జోక్ పేల్చాననుకునే లోపే, సదరు భద్రతాధికారి వేగంగా స్పందించాడు. సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే ప్రయాణికులను అక్కడి నుంచి దూరంగా పంపేసి, తనిఖీలు మొదలుపెట్టాయి విమానాశ్రయ వర్గాలు. తాను జోక్ చేశానని ఆ వైద్యుడు మొత్తుకున్నా వినే నాథుడే లేకపోయాడు. అనంతరం, అతనిపై కేసు నమోదు చేసి కోర్టు బోనెక్కించారు. రూ. 55 లక్షల జరిమానా కడితే ఉత్తుత్తి బాంబు బెదిరింపు తదితర ఆరోపణలను వెనక్కితీసుకునేందుకు ప్రాసిక్యూటర్లు అంగీకరించారు.

  • Loading...

More Telugu News